డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

  • ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో గుర్తు చేసిన మిథున్ రెడ్డి
  • హోదా ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చట్టంలో లేదని తప్పించుకున్నారని విమర్శ
  • డీలిమిటేషన్ విషయంలో అదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 'ప్రత్యేక హోదా' ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన హితవు పలికారు.


ముఖ్యంగా ఏపీలో లోక్‌సభ స్థానాల విషయంలో ఒక్క సీటు తగ్గినా, లేదా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఏ చిన్న అన్యాయం జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సైతం ఇదే అంశంపై స్పందిస్తూ.. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య సీట్ల కేటాయింపులో సమానత్వం ఉండాలని, అప్పుడే డీలిమిటేషన్‌కు అసలైన సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల పంపకాల్లో తేడాలు వస్తే పోరాటం తప్పదని పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఈ ప్రక్రియ ఉండకూడదన్నదే వైసీపీ ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది.


Mithun Reddy
YSRCP
Andhra Pradesh
Delimitation
Lok Sabha
YV Subba Reddy
Parliament
Special Status
AP Reorganisation Act
Seat Allocation

More Telugu News